మాటలతో మనసును చేసిన గాయం కన్నా
నిర్లక్ష్యంతో నువ్వు నా మనసుకు కట్టిన సమాధి ఎంత దృఢంగా ఉందో..
కళ్ళకు కమ్మిన చీకట్లలో
నా కంటికి కనిపించే రూపం నీదే..
గతాన్ని చీకటి పొరల్లో కూడా
తొలిచి తొలిచి చూపిస్తుంది..
వెనక్కి వేయాలని ఉంది ఒక అడుగు
నిను నిందించడానికి కాదు..
నీ వేపు పడిన పాదాన్ని మందలించి
నిను నమ్మిన నమ్మకాన్ని మందలించాలని ఉంది..
నిన్ను మరచిపోలేదు, మరచిపోలేను
గుర్తు తెచ్చుకోవడం లేదు అంతే..
నీపై కోపం లేదు
అలాగని నువ్వు ఇచ్చిన బాధ పోలేదు..
నిను వెతకని నా ఆలోచనలలో
నే ఒంటరిగా ఉన్న..
కనులను తడిపేసిన ఓ తుఫాను
విలయానికి ఆనవాలుగా నా మనసును వదిలి పోయింది..
రేయి, పగలుకు మధ్య
వేగు చుక్కలా ఏ ఆశో ఇంకా ఊపిరి పోస్తుంది
నువ్వు చెరిపేసిన నా రేపటికి..
✍️అరుణిమలు
No comments:
Post a Comment