Thursday, 20 April 2017

తాను నేను

నీ పిలుపుకి బదులివ్వకుండా ఉండాలి అనుకుంటుంటాను కాని చేతకావట్లేదు...
నీ ఆలోచనలు రాకూడదు అనుకుంటుంటాను కాని నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతుంటాయి...
నీకోసం ఎదురు చూడకూడదు అనుకుంటుంటాను కాని నా కళ్ళు వెతికేది నిన్నే కదా....
నీ ఊహ కూడా నను తాకకూడదు అనుకుంటుంటాను కాని నా ఊహల్లో,కలల్లో నాకు కూడా స్ధానం లేకుండా ఆక్రమించేసావే...
నిదుర కూడా కరువై పోయింది ... రేయంతా నీ తలపుల జాగారమే కదా ఈ వెర్రి మనసుకు...
ఇంతలా నా మీద నాకు వశము లేకుండా ఎందుకు పోయింది ...
ఒక చిన్న అబద్ధం ఆడితే ఎవరన్నా నాకు దూరంగా ఉండండంటూ వాళ్ళ స్ధానం చూపించే నేను ఇలా..ఎలా
ప్రతిసారీ నీ ఎడబాటు నన్ను నలిపి నలిపి పారేస్తుంది...నన్ను నేను నిలబెట్టుకోవడానికి నా శక్తి కూడా నాకు చాలేది కాదు...
నేను బాగున్నాను అంటు నిన్ను మరచిపోతానంటు నన్ను నేను మభ్యపెట్టుకుంటూ మోసం చేసుకునేదాన్ని..
మరచిపోవాలని పదే పదే నిన్ను తలంచి ఇంకా దుఃఖాన్ని పెంచుకుంటూ...ఎవరి ఆసరా అయినా తీసుకుందామా అనిపించేది...
కాని ఎవరికి చెప్పుకోను ఇదంతా...నిన్ను నేనే ఒక్క తిట్టు తిట్టంది ఆ అవకాశం ఎవరికైనా ఎలా ఇస్తాను...
మళ్ళీ నువ్వొచ్చి ఎదో సంజాయిషీ ఇచ్చి ఈసారి ఇలా జరగనివ్వను అంటే నమ్మేయడం నాకలవాటు....
ఎందుకంటే నా దుఃఖానికి కారకుడువి నువ్వే...నా భాదకి ఔషదం కూడా నువ్వే కనుక...
నా నమ్మకాన్ని నిలబెట్టలేవు అని నాకు తెలిసి కూడా నమ్ముతాను నేను నిన్ను కారణం తెలియదు ...
నువ్వు చేసే పనులకు ఎంత కోపం ఉన్నా ఆ కోపాన్ని చూపించలేని ఆసక్తురాలిని...
నీ అవసరాన్ని నేను అలాగే అవసరమైతే నన్ను ఎవరి దగ్గర ఎలా చెడు చేస్తున్నావో తెలిసి కూడా నీమీద అసహ్యం రావట్లేదు ఎందుకో....
నీ అబద్ధాలు, అవసరాలు, వాడకాలు ఇలా ఏది నీ మీద నాకు కోపాన్ని తప్పించి అసహ్యాన్ని పుట్టించలేక పోతున్నాయి ....
అన్ని వినడం భాదపడటం.. నువ్వింతే అనుకోవడం..ఇదేమి వింతో మరి
ఎలాంటి పనులు చేసినా మన మీద అసహ్యం కలగని వాళ్ళు ఇద్దరే ఈ లోకంలో తల్లిదండ్రులు ...
మరి నేను ఎవరిని ...నాకెందుకు ఈ సహనం,నాకెందుకు అసహ్యం కలగట్లేదు...నువ్వు నాకన్నా నాకు ఎక్కువ అయిపోయావా
నమ్మకంగా నీ దగ్గర నాకు నచ్చినవి చెప్పుకోవాలి అనున్నా...అవెప్పుడు ఎక్కడ ఎలా వాడుకొని నన్ను ఎవరి దృష్టిలో దిగజారుస్తావో అని చెప్పుకోవడమే మానేసాను తెలుసా....
ఈ మనసులో ఎంత అంతర్యుద్ధం జరుగుతున్నా నీ పిలుపుకు నా మనసు సెలయేటి మీద పిల్లగాలిలా చప్పున బదులిస్తుంది చల్లగా...
ఎలా సాధ్యం అంటే.. ఇది నాకే తెలియని నా చర్య...ఇంక ఎవరికి ఏమని చెప్పను కారణం ....

        ..............అరుణని.............

No comments:

Post a Comment