Sunday, 23 April 2017

మనసా ఓ మనసా

మనసా ఓ మనసా ఇది నీ కథే తెలుసా
మనసే లేని మనసును వలచావు
మది నిండా నింపుకున్నావు ఆ మనసును
నీకుంచావా కాస్త చోటు....లేదే
ఏమంత నమ్మకం ఇచ్చిందే నీకు ఆ మనసు
తనని తాను ప్రేమించుకోవడం కూడా చేతకాదే ఆ మనసుకు.....
మరి నిన్నెలా వలస్తుంది అనుకున్నావు ఆ మనసు
మనసంటే ఆటబొమ్మే ఆ మనసుకు...
మాటిమాటికి మారేది కాదంటారు మనసును
కాని నువ్వు వలచిన మనసుకు మగువ మైకం ఎక్కువే....
మాటిమాటికీ ప్రేమలొ పడడం ఇష్టం...ఒకరితోనే కాదు సుమీ
వలచినప్పుడు ఊహల్లో ఊరేగింపు కాస్త పాతపడ్డాక...పేచీ పెట్టినా కూడా కన్నెత్తి చూడని నైజం ఆ మనసుది...
ఒక అవసరాన్ని ప్రేమించానని తెలిసాకైనా ఆగావా...లేదే
విలువ తెలియని చోట కూసింత చోటు కోసం పాకులాడావు...ఏమంత అవసరమే అసలు నీకు
మనసుందని వలచి ఈ రోజు నువ్వు వగచిన కాసంత కనికరం ఎరుగని మనసే అది...
కనికరం లేనిచోట కరుణ దొరకదు కాఠిన్యము తప్పించి...
నువ్వు తపించిన ఆ తపన పిసరంతకూడా ఆ గుండెను పిండదు...
కన్నీటితో వాలిన రెప్పలు కాస్త ఎత్తి చూడవే...
మోసపోయింది నీ మనసు కాదు నీ ఆలోచనలు,అంచనాలు, నమ్మకం
మనిషిగా బతకలేని మనసు నుండి నీకు దక్కేది దగా మాత్రమే ....
తేరుకోవే మనసా...నిస్వార్ధమైన ప్రేమను అందుకోలేని ఆ పేద మనసును చూసి...
జాలిపడవే...రేపన్న రోజున అనాధగా మిగిలే మనసుకు నువ్వు ఈ రోజు ఇవ్వగలిగేది ఒక కన్నీటి బొట్టు...
అది చాలు....ఇంక నిన్ను ప్రేమించే మనసుల వేపు ఒకసారి చూడు...
అందుకోవడమే కాదు ఇవ్వడం చేతనైన దానివిగా...
నీకేంటి కొరత ఇంక...అపార్ధ దానం చేసింది చాలింక
ఇకనైనా కదులింక ముందుకు......

...........అరుణని..............

No comments:

Post a Comment