Thursday, 20 April 2017

తాను నేను

నా ఊహలలో ఊరేగుతున్నాయి నీ ఆలోచనలు
ఊగిసలాడకే మనసా అంటే మాటవినదాయే
మెత్తగా చెబితే వింటుందా ఏంటి
మహా మోండిగా తయారు చేసి మరీ అప్పచెప్పావురా
నాతోనే సరిపోదు మా ఇద్దరితో వేగమని అంటూ
రేయంతా నీ తలపుల తాకిడిలో
ఇదిగో... ఇలా తడిసి ముద్దయ్యానోయ్
నీ కలల వాకిట్లో వెన్నెల ముగ్గేసా మురిపెంగా
కొంచెం రంగులు అద్ది పెట్టవోయ్ దానికి
మనసు కూని రాగాలు తీస్తుంది నీ పేరుని
అటుఇటుగా సవరిస్తూ వినిపించిందా
నా మేను పరిమళాల గుభాళింపు
గుబులు రేపుతుందేమో కదా
గుచ్చిగుచ్చి చూపులతో దోచేస్తున్నావు
నీ ఊసులను సరిగమలుగా మలిచానోయ్
ఊ కొడుతున్నావ ఉలిక్కి పడుతున్నావా
ఎవరికీ వినపించని రాగాలేగా మనవి
ఏకాంతానికి ఈ కాంతను ఇలా కానుక చేయడం తగునా
అని అడగాలి ఉన్నా
అరక్షణమైనా నిను తలవని గడియ ఎక్కడుందీ
నా దగ్గర లేవనే మాటే కాని మదినిండా నీవేనోయ్
ఈ పెదవులపై నీ పేరు పచ్చబొట్టేసా నువ్వు కూడా చెరపలేవు సుమీ
ఈ మది నీ మందిరం మరోకరి నీడ కూడా పడదు ఎప్పటికి
మనసుని కానుకగా చేసి ఇచ్చేసా ఇక నీ ఇష్టం
ఈ అక్షరాలు మాత్రమే సాక్షి మన ప్రేమకు
వీటికి మాటలు రావులే మనగురించి చెప్పడానికీ
అలా చూడకోయ్ నేనేమి అనలేదిప్పుడు....
నిన్ను ఉడికించడం..ఆటపట్టించడం..కవ్వించడం..గిల్లికజ్జాలు..గొడవపడటం..అన్నీ ఇష్టమే నాకు
ఆఖరుకి నీ కోసం నేను కరిగి కన్నీరుని అవడం కూడా..
...........అరుణని..............

No comments:

Post a Comment