ఎప్పుడు పడ్డావో నా కళ్ళల్లో నువ్వు ...
ఏ క్షణాన దూరావో దొంగలా ఈ గుండె గూటిలోకి ...
కాలంతో పనిలేకుండా కనుమాయ చేసేసావోయ్...
ఒకరి కోసం లోకాన్ని ఎదిరించనూగలం...
ఆ ఒక్కరిని లోకమంతా ఏకమైన కూడా మరచిపోయేట్టు చేయలేదు అని నువ్వొచ్చాకే తెలిసిందోయ్...
ఎంతవరకు ఈ పయనం అంటే...
నా గుండె సడి ఆగేవరకు...
ఎదలో నా రాజువి...ఎదురుగా గడియ గడియకో రూపును అద్దుతుంటావుగా నీకు నచ్చినట్టుగా...
మాటిచ్చావు ఈ మనసుకి నాలో సగం నువ్వని గుర్తుందా...
అది గడిచిన ఙ్ఞాపకంలో బందీ అయిపోయింది కదూ...ఆ మాటకి సాక్ష్యం మన ఇరువురి మనసులే కదా...
మనసు మూగది, మాటలు రానిది...ఆ రోజు ఆ మాట ..ఈ రోజు ఈ మాట...ఏంటి ఈ నీటిమీద రాతలు అంటూ అడగలేదు కదా...
నేను ఏ మాట నీకు ఇవ్వలేదు కాని నా మనసుకు ఇచ్చానోయ్...ఈ జన్మకు ఈ మొండి వాడు చాలంటూ...
అందుకు నా ఈ చేతి గీతలే సాక్ష్యం...
నా మాటెప్పుడు పదిలమేనోయ్...ఇచ్చింది ఆత్మ సాక్షిగా కదా మరి...
మనసారా ఒక పిలుపు చాలు.. ఏ ఏడేడు లోకాల్లో ఎక్కడ ఉన్నా నీ పిలుపుకు బదులివ్వకుండా ఉండదు ఈ మనసు...
నీ పిలుపుకి బదులంటూ దొరకనిది నేనంటూ ఈ లోకంలో లేని రోజునే ...
నీ ఆటలకు మనసు అలసిపోయిన ప్రతీసారీ నీ పలుకే శక్తిని ఇస్తుంది...
పదిలంగా దాచుకున్న నా ప్రేమను నీకు విన్నవించలేను పదేపదే ...
నీకు తెలియనిది కాదు నా ప్రేమ కాని నీకు అనవసరం ఈరోజు...
ఒకప్పటిలా కాదు అసలు నువ్వు నీలా కూడా నాతో ఉండలేవని తెలుసులే...
నిన్నలలో మనం ఈ రోజులలో నువ్వు, నేను...అంతేగా
పరాయి చేయడమే కాదు...పరాకులో కూడా పలకరించడానికి మాటలే కరువు చేసిన వాడివి...
నాకు తెలియని ఈ విద్యను నేర్పి వెళ్ళిపోవాల్సింది...
కనీసం నీకోసం ఈ ఎదురు చూపుల వెతలు నను తాకేవి కాదుగా....
.............అరుణని............
No comments:
Post a Comment