Thursday, 20 April 2017

తాను నేను

మొదటిసారి నీ పిలుపుకు నా మనసు ఎలా బదులిచ్చిందొ
ఇప్పటికీ నీ పిలుపుకు నా బదులు అలానే ఉంది
నీ ముందు నేను నేనుగా ఉన్నది ఎప్పుడు అన్నది గరుతు కూడా లేదు
నీ మాటలు పరవళ్ళలో నేను ఎలా కొట్టుకుపోయానో నాకు తెలియదు
దారితప్పి వచ్చావో.. దారి తెలుసుకుని వచ్చావో మరి నా మదిలోకి
తిష్ఠ వేసుకుని ఉన్నావా కాదులే ప్రతిష్టించింది నేనేగా
నువ్వేంటో తెలియక ముందు చూసిన ఎదురు చూపులకు..
ఈ నాటి నా ఎదురు చూపులకు తేడా ఎందుకు లేదు..ఏమొ మరి
నా అక్షరాలు నీకు అక్షింతలు అంటావు అసలుకి అవన్నీ నీ చేతలని మరచి
నీ కధలలొ నేను ఒక కధను మాత్రమే నీకు
నీ అవసరాలలో ఒక అవసరాన్ని
నీ అబద్ధాలలో నేను ఒక నిజాన్ని
మాట ఇవ్వడం అంటే ఆ మాట మీద నిలబడడం కాదు కదా నీకు
మనసున్న వాడివే నువ్వు ..మనసును విరిచేయడంలోనే సుమీ
నిజమైన ప్రేమంటే భయమేమొ నీకు ఎక్కడ ఒక్కచోటే ఆగిపోవాలో అని
నీ మనిషిగా కాదు సాటి మనిషిగా కూడా విలువ ఇవ్వడానికి తడబడుతున్నావు ఎందుకో...
పదిమందిలో ఎదుటి వాళ్ళ తరుపున నువ్వు ఉండి నన్ను ప్రశ్నలు సందిస్తున్నప్పుడు..
క్షణమైనా నేనెవరో నీకు తట్టలేదు కదూ
ఎన్ని దారులున్నాయొ వెతుకు ..ఎలా విరిచేస్తే నా మనసుని
నిన్ను తనలో నుండి బయటకు పంపేస్తుందో తొందరగా తెలుసుకో
నిన్ను నిన్నుగా నీ నిజాలని,నువ్విచ్చే విలువను చూస్తూనే ఉన్నాను
చెంపలు తడి ఆరనంటున్నాయి ...గాయాలు పెరుగుతునే ఉన్నాయి
కానీ ఇంకా నవ్వుతూ ఉన్నాను నీ ముందర మౌనంగా....
ఇంత మొద్దుబారిపోయింది ఏంటో నా మనసు ....ఇది నాది కాదు కదా
అందుకే ఇంత సిగ్గులేకుండా ఇంకా నీ ముందు పడుంది..
ఏం కావాలి అంటావా...ఏం ఉందని అడగాలి,ఇవ్వడం చేతకానివాడిని
నా ప్రేమకు మరణం రానివ్వను..అలాగని నిన్ను శరణు కోరను
నీ మీద పిచ్చి ప్రేముంది ఉంటుంది ఇలాగే కాని నువ్వు వద్దు
కాలానికీ ఎంత కక్ష కాకపోతే నిన్ను తీసుకొచ్చి నన్ను ఇలా శిక్షిస్తుందా
ఎవడికి తలవంచను అన్నాననేగా ...గెలిచావు నువ్వే నా నుండి నన్ను వెలివేసి
కాలానికి గాయం మాన్పడమే వచ్చు అనుకున్న కాని ఇలా సాధించడం కూడా తెలుసు అనుకోలేదు ...
........అరుణని........

No comments:

Post a Comment