Saturday, 2 December 2017
తాను నేను
గోధుమ వర్ణాన్ని పులుముకున్న ఆకాశం
నెమ్మిదిగా అలుముకున్న మబ్బులతో అచ్చు మన ఆలోచనలలా ముసురుకుంది.....
కిటికీ గుండా వస్తున్న గాలి చల్లదనాన్ని మొసుకొస్తూ ఊరటనిస్తుంది...
అనుకోకుండా పెదవిపై చిరునవ్వు ఆ గాలి గాడి తాకిడి ఎక్కడ ఎక్కడో తాకుతోంది మరీ సుతారంగా...
అరటి ఆకుల చప్పుడు వినిపిస్తుంది గాలి జోరు పెరిగిందని...
ఒక్కసారి గుండెల నిండా శ్వాస పీల్చాలని అది ఆకాశాన్ని చూస్తూ అనిపించింది...
బయటకు వెళ్ళి చూసా పరుగు పందెం వేసుకొని ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ పరుగిడుతున్న మేఘాలు...
కబుర్లు మోసుకుపొమ్మంటే కరిగిపోతాం మాకెందుకు అంటారు పెద్ద అంటూ ఆకాశాన్ని చూసి కన్నుగీటి కసురుకుని కూర్చుంటే....
చెప్తా నీ సంగతంటు చిలకరించేసాడు చినుకులను...
ఒక్కొక్క చినుకు చురుక్కుమంటూ తాకుతుంటే తెలిసింది కన్ను గీటితో రియాక్షన్ ఇలా ఉంటుంది అని..
ఓహో నువ్వాడితే నే ఆడనా అని గొడుగేసుకొని వచ్చా బయటకు...
మోమును తాకాలనే ప్రయత్నం చేస్తూ పాదాలను ముద్దిడుతూ అల్లరి చేస్తూన్నాడు...
గాలితో విసిరి కొడుతూ వేడెక్కుతున్న వాడి వాడిని చూసి నవ్వొచ్చి ఎంత విసురో అని మురిసి...
గొడుగును వదిలేసి చేతులు చాపి నన్ను అల్లుకుపొమ్మంటు పిలిచా...
తడిపేసాడు అణువంత చోటును కూడా వదలలేదు తడిమి తడిమి మరీ...
ఓయ్......మళ్ళీ ఎప్పుడొస్తావు అంటూ కన్నుగీటి ఇక నావలన కాదంటూ వాడద్దిన పారాణి పాదాల ముద్రలను ముద్రిస్తూ నీడకు పరుగందుకున్న....
ఏయ్....ఈసారి చూసుకుందాం నువ్వో,నేనో ;)
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment