Friday, 1 December 2017

తాను నేను

జ్ఞాపకాల తీరంలో ఉన్నా ఈరోజు...
నీతో కలిసి గడిపిన కాలం తక్కువే రా...
అమావాస్య చంద్రుడువి కదా నీ రాకపోకలు అంతా లెక్క మీద జరిగింది..
ఒడ్డున ఈ ఏకాంతాన నీ పలుకుల తరంగాలు తాకుతునే ఉన్నాయి ఇంకా...
ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావు అనిపించే ధ్యాస...
మళ్ళీ కనిపించని కలలా కరిగి ఇంకిపోయావు మదిలో..
ఆశల ఊట బావికి మాత్రం ఇంకా ఆశ తీరలేదోయ్ నువ్వొస్తావని...
ఎదురు చూపులు విసుగన్న పదాన్నే మరచాయి రా...
నీ మాటలు పేక మేడలని చెప్పలేదు కదా ఆ రోజు మాటిచ్చినప్పుడు...
ప్రవహించే నదివే నువ్వు కాలం మారితే కొత్త నీటితో పరవళ్ళు తొక్కాలనే కోర్కెలెక్కువ కదా...
పలకరిస్తూ,పరవసింప చేస్తూ, నీలో కలిపేసుకున్నాక మనం కాదు నువ్వు వేరు నేను వేరనే గొప్పవాడివి...
కావాలనుకున్న దాని కోసం స్వరూపాన్ని సైతం మార్చగలవు..వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకుండా పోగలవు ముందుకు...
నీ మది సుడిగుండంలో చిక్కిన ప్రాణాన్ని చూసి అయ్యో అనలేని కాఠిన్యం నీది...
ఎందుకోయ్ ఏ ఒడ్డును తాకకుండా పోరాదు ముందుకు, కుదరదే...
నీకు మేం కావాలి కాని ఒక అవసరంగా మాత్రమే కదూ...
నిను తాకిన గాలి నాకు ఆయువు అనుకున్న కానీ...ఈరోజు ఉక్కిరిబిక్కిరి గా ఉందోయ్
చాలింక ఊపిరి ఆగిన మంచిదే అనిపిస్తుంది నువ్వు అనే అనుభవం గురుతుకొచ్చినప్పుడల్లా...

✍️అరుణిమలు

No comments:

Post a Comment