Saturday, 2 December 2017

తాను నేను

రచిస్తున్నానో..పదాలను పేరుస్తున్నానో తెలియడం లేదు.. వెలి వేయలేని భావాలలో బందీని కాలేక ..నాకు నేను రాసుకుంటున్న భరోసా ఇది.. ఙ్ఞాపకాల బారం ఎంతుందో తెలుసా అంటే...రుచి చూడమని కన్నీరు పెదవిని తాకుతుంది.. రంగుల కలలు చూపించావేమో...ఆ రంగులన్నీ తెచ్చి ఒక చోట అద్ది చూసాను.. దిష్టి చుక్కలా మారి వెక్కిరిస్తున్న ఆ కలలను కాటుకగా అలంకరించా.. అందుకనేమో కనులకు కునుకు లేదు.. నీ ఆలోచనల నుండి తప్పించుకునే దారిని కూడా మూసేసావు...నిదరుని చెదిరించి మరి... నవ్వులను అద్దుకున్న పెదవులు పలికే... బాగున్నాననే పలుకులను విని ఊరుకో... కళ్ళలోకి మాత్రం చూడకు నటించడం వాటికి రాదు కదా... నిన్ను కదిలించ లేకపోయినా అవి చెలించి పోతాయి... నీ జీవితంలో నేనొక చిన్న పాత్రను మాత్రమే... మరి నువ్వో...చూస్తున్నావుగా చదువుతూ నా... మన ఈ పుస్తకాన్ని.. అన్నిటా నువ్వే కదూ.. నేను ఎక్కడ అని వెతికి చూడు..నువ్వు అడుగిడిన నాడే కనుమరుగై పోవడం కనిపిస్తుంది.... నిండుగా ఉన్నాను సాగరంలా...అనంతమైన ఘోషను నాలో నింపుకొని... ఒడ్డుకి చేరాలనే తపనతో పోరాడుతున్న కెరటంలా నిరంతరం శ్రమిస్తూ.. సాగర గర్బంలో దాగిన నువ్వనే నిశ్శబ్దాన్ని దిగమింగుతూ...‌ నదిలా స్వచ్చంగా చేరానురా నీలో.... ఇన్ని అక్షరాల సుడిగుండంలో వదిలేస్తావనుకోలేదు.... ✍️అరుణిమలు

No comments:

Post a Comment