Friday, 2 February 2018

తాను నేను

ఎక్కడున్నావోయ్....
చలి గిలిగింతలు ఇక్కడ నన్ను తాకుతున్నాయి...
మది సరస్సును తాకిన నీ గాలి
ఎదలో గుబులు రేపుతుంది..

అల్లంత దూరాల అల్లన దాగిన చందమామవే
ఈ మనస్సులో వెన్నెల జల్లులు జల్లేసి...
సిగ్గులను జల్లెడ పట్డేందుకు మాపటేల
ఎదురొచ్చే నారేడువి..

ఆలోచనల పరదాలు దాటి...
ఇష్టాన్ని ఉట్టి దింపి....అలకల కోనలను దాటి
కోరికల కొలనులో స్నానాలు ఆడి...
నెమలి కోనలోకి అడుగిడవోయ్..

వెన్న పూసిన వన్నెలను ఆరగించగ...
కౌగిలి కాచిన వలపుల తేనియలను దోచగ...
వసంతాల వయ్యారాలను ఒడిసి పట్టగా...

నింగికి కాస్త ఏకాంతాన్ని రుచి చూపిద్దాం...
ఎడబాటు అర్ధాన్ని వర్ణించమని అవకాశాన్ని ఇద్దాం...
నిన్ను నాలో చూపించాలని ఉంది ఆ నింగికి...
నువ్వు నేను ఒకటంటే కుళ్ళుకునే కళ్ళను చూస్తే ఒకింత గర్వమే ఈ మనసుకు...
లోకాన్ని జయించడమే నువ్వు నాలో, నాతో ఉంటే...

✍️అరుణిమలు

No comments:

Post a Comment